బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. వరంగల్‌ జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నమోదైన బెదిరింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సోమవారం వరకు ఆయన అరెస్ట్‌ను నిషేధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే… కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారన్న ఆరోపణలపై పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో రాజకీయ కక్షలే కారణమంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం, కేసుకు సంబంధించి దర్యాప్తును కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. అయితే పోలీసులకు కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ పక్ష న్యాయవాది (పీపీ) వాదనల్లో… మనోజ్ 2023 అక్టోబర్ 25న రూ.25 లక్షలు కౌశిక్ రెడ్డికి చెల్లించారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి బెదిరించడంతోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని వాదించారు. ప్రస్తుతం మరో రూ.50 లక్షలు డిమాండ్ చేయడంతోనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వివరించారు.

ఈ అంశాలన్నింటిని పరిశీలించిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణ వరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ కేసు రాజకీయంగా ఎలా మలుపుతిరుగుతుందన్నది చూస్తుండాల్సిందే.

Read More : 28 మంది పర్యాటకుల మృతి, సీఎం నిరసన