పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
“మేము ఉగ్రదాడి బాధితులతో ఉన్నాము. ఈ పాశ్విక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్‌లు ఆడం లేదు. కానీ, ఐసీసీ ఈవెంట్స్ గురించి మాట్లాడతే, నిబంధనల ప్రకారం మనం ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీకి కూడా ఏం జరుగుతుందో తెలుసు” అని ఆయన స్పోర్ట్స్ టాక్‌తో అన్నారు.
ఈ ఉగ్రదాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా సంతాపం వ్యక్తం చేశారు. “పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం క్రికెట్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ భయంకరమైన చర్యను బీసీసీఐ ఖండిస్తుంది. మృతుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని సైకియా అన్నారు.
ఇప్పటికే, 2012-13 తర్వాత భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. 2008లో భారత్ చివరిసారిగా పాక్‌ను సందర్శించింది. ప్రస్తుతం, దాయాది దేశాలు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారతదేశానికి వచ్చింది, కానీ 2023 ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్‌కు భారత్ వెళ్లకుండా దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడింది.
Read More : గౌతమ్ గంభీర్ – ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు
