గౌతమ్ గంభీర్‌ – ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ‘ఐసిస్ కశ్మీర్‌’ పేరిట రెండు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో గంభీర్ వెంటనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు కుటుంబ సభ్యులకూ భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గంభీర్ ఈ మెయిల్స్‌పై రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే గంభీర్‌కు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

ఇదే తరహా బెదిరింపులు గంభీర్‌కు ఇదే మొదటిసారి కాదు. 2021లో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా ఈమెయిల్ ఆయనకు వచ్చింది.

ఇదిలా ఉండగా, పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని గంభీర్ ఇటీవలే ఖండించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన “మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకార దాడి చేస్తుంది” అని పేర్కొన్నారు. పహల్గామ్ దాడిలో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More : పహల్‌గామ్ దాడిపై క్రికెట్ దిగ్గజాల స్పందన..

One thought on “గౌతమ్ గంభీర్‌ – ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

Comments are closed.