హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోటి కొలతల నష్టాల భారం వెంట తెచ్చుకున్నామని ఎల్అండ్టీ మెట్రో సంస్థ స్పష్టం చేసింది. సంస్థ ప్రకటన ప్రకారం… గతంలో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో మెట్రో రైలు సేవలకు భారీగా ఆదాయం నష్టం వాటిల్లిందని, అదే సమయంలో చార్జీల పెంపు అవసరం ఉందని అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది. అయితే, అప్పటి ప్రభుత్వం ఈ సూచనను ఆమోదించకపోవడంతో ఛార్జీల పెంపు నిర్ణయం వాయిదా వేసినట్లు తెలిపింది.
అయితే ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపు అనివార్యమని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో ఇటీవల మెట్రో ఛార్జీలు 44 శాతం పెరిగిన తరహాలో, హైదరాబాద్లో ఎంత మేర పెంపు చేయాలన్నదానిపై సంస్థ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే, ఇప్పటికే హైదరాబాద్ మెట్రో సంస్థ పలు రాయితీలను కూడా తొలగించింది. రూ.59కి లభిస్తున్న ‘హాలిడే సేవర్ కార్డు’ను రద్దు చేయడంతోపాటు, మెట్రోకార్డుపై రద్దీ సమయంలో అందిస్తున్న 10% డిస్కౌంట్ను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల మధ్య, త్వరలోనే ఛార్జీల పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More : రంగారెడ్డి టోల్ గేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగి దౌర్జన్యం — టోల్ సిబ్బందిపై దాడి
