రాష్ట్రంలో నిరుద్యోగులు కళ్లలో కలలతో ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎస్సీ ప్రకటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని స్పష్టంగా సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన ప్రక్రియ కొనసాగించాలని పేర్కొన్నారు.
అలాగే పది, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ‘మనమిత్ర’ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. జీఓ-117కు ప్రత్యామ్నాయంగా కొత్త జీఓని సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే 48 శాతం పాఠ్యపుస్తక ముద్రణ పూర్తయిందని అధికారులు మంత్రికి నివేదించారు.
వేసవి సెలవుల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్ల బదిలీలను పూర్తి చేయాలని ఆమోదం తెలిపారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అమరావతిలో కేంద్రీయ గ్రంథాలయం, శిక్షణ అకాడమీ, మ్యూజియం నిర్మాణాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జూన్ నాటికి విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుపై కూడా సమీక్షించారు. దీంతో, నిరుద్యోగుల కోరిక నెరవేరే దిశగా మెగా డీఎస్సీ ప్రక్రియ వేగం పొందుతోంది.
Read More : అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసానికి శంకుస్థాపన..

One thought on “మెగా DSC కి శుభారంభం – త్వరలో నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలు”
Comments are closed.