వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. “పోలీసుల గుడ్డలు ఊడదీస్తాం, యూనిఫాం విప్పించి ఉద్యోగాల నుంచి తొలగిస్తాం” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం ఖండించింది.
రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, “ఇది ఫ్యాషన్ షోనా గుడ్డలు ఊడదీయడానికి?” అంటూ ప్రశ్నించారు. పోలీసులపై చేసిన ఈ వ్యాఖ్యలు బాధాకరమని, అత్యంత ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఇలా విమర్శించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళా పోలీసు అధికారి భవాని కూడా జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులలో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని జగన్ మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. మహిళా పోలీసుల పరువు నాశనం చేసేలా ఉన్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
జగన్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో, ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Read More : రామగిరి ఎస్సై వ్యాఖ్యలపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందన
