అయ్యగారే నెం.1 – అఖిల్ మాస్ గెటప్‌తో రీ ఎంట్రీ!

Akhil Akkineni new movie 2025

అక్కినేని మూడో తరం వారసుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన అఖిల్, చిన్నతనంలోనే ‘సిసింద్రీ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత ‘మనం’ సినిమా క్లైమాక్స్ లో మెరిసి, మంచి హీరో మెటిరియల్‌గా నిలిచాడు. 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో రెండేళ్ల విరామం తర్వాత ఫుల్ జోష్‌తో మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు అఖిల్.

ఈసారి మాత్రం హిట్ మిస్సవ్వకూడదని పూర్తి ఫోకస్‌తో ప్రిపేర్ అవుతున్నాడు అఖిల్. అక్కినేని అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిడికిలి బిగబట్టి ఉన్న ఆ ఫొటోతో “ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు” అనే క్యాప్షన్ ఇచ్చి అఖిల్ మాస్ లుక్‌పై హైప్ పెంచాడు. ఈ లుక్‌తో ఈసారి అఖిల్ గట్టి పంచ్ వేయనున్నాడనే అభిప్రాయం అభిమానుల్లో ఏర్పడింది.

ఈ సినిమా కోసం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయ్యగారు ఈసారి మాస్ విజయం సాధిస్తారో లేదో ఆసక్తిగా వేచి చూడాలి.

Read More

One thought on “అయ్యగారే నెం.1 – అఖిల్ మాస్ గెటప్‌తో రీ ఎంట్రీ!

Comments are closed.