హైదరాబాద్ జన్మభూమిగా, బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అందాల నటి దియా మీర్జా తన వ్యక్తిగత జీవితం విషయాల్లోనూ స్పష్టతతో ముందడుగు వేస్తోంది. మిస్ ఆసియా పసిఫిక్‌గా కిరీటం గెలిచిన దియా, నటిగా విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తూనే పర్యావరణ అనుకూల కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. తెలుగులో ‘వైల్డ్ డాగ్’లోనూ కనిపించిన ఆమె, 2014లో వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాను వివాహం చేసుకుని, ఐదేళ్లకే విడిపోయింది. అనంతరం వైభవ్ రేఖీతో రెండో వివాహం చేసుకున్న దియా, ఈ వివాహాన్ని సంపూర్ణంగా ప్రకృతి పద్ధతిలో జరిపారు.
తాజా ఇంటర్వ్యూలో దియా తన రెండో పెళ్లి వెనుక ఉన్న ఆలోచనలను వివరించింది. ఇంటి తోటలోనే నిరాడంబరంగా నిర్వహించిన ఈ వేడుకలో స్థానికంగా లభించే అలంకరణ వస్తువులు, చేతితో తయారైన బహుమతులు ఉపయోగించారు. ఆహరం వృథా కాకుండా ఉండేందుకు, అతిథులకు అందించాల్సిన వంటకాలను ముందే నిర్ణయించారు. అంతేకాదు, ఒక మహిళా పూజారితో వేడుకను జరిపించడం, ఆమె ప్రత్యేకతను సూచిస్తోంది. ఈ విధానం ద్వారా వివాహ వేడుకలు పర్యావరణాన్ని హానికరం చేయకుండా కూడా నిర్వహించవచ్చని ఆమె తెలిపింది.
దియా తన మొదటి వివాహం విషయంలో క్లుప్తంగా స్పందిస్తూ, అప్పట్లో ఖరీదైన లెహంగా ధరించానని, కానీ తర్వాత వాటిని వాడకపోవడం వలన అవి వ్యర్థమైపోతాయని చెప్పింది. అందుకే వాటిని వేలం వేసి సద్వినియోగం చేశానని చెప్పింది. రెండో పెళ్లికి మాత్రం సాధారణ చీరను ఎంచుకున్న దియా, తన భర్త కూడా బ్రైడల్ వేర్‌కు బదులుగా సాధారణంగా జీవితాంతం ధరించగలిగే దుస్తులే ఎంచుకున్నారని పేర్కొంది. డిజైనర్ రీతూ కుమార్ రూపొందించిన ఆకుపచ్చ ఘరారా ధరించి పెళ్లికి కొత్త కోణం తీసుకురావడంలో దియా ముందుంది.

One thought on “బాలీవుడ్ పెళ్లికూతుళ్లకు భిన్నంగా దియా మీర్జా స్టైల్!”
Comments are closed.