సహకార బ్యాంకుల్లో అవకతవకలపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

atchannaidu

సహకార బ్యాంకుల్లో అవకతవకలపై రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు డీసీసీబీ బ్యాంకుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిన విషయం వాస్తవమని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ అవినీతికి ప్రధాన కారణం డీసీసీబీలలో సరైన పద్ధతి అమలు కాకపోవడమేనని పేర్కొన్నారు.

అవినీతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సెక్రటరీలు, డీసీసీబీ అధికారులను బదిలీ చేసే జీవో తీసుకురాగా, హైకోర్టు ఆ జీవోపై స్టే విధించిందని మంత్రి గుర్తు చేశారు. అయితే, స్టే వెకేట్ చేయించుకుని చర్యలు కొనసాగించనున్నట్లు చెప్పారు.

గత తొమ్మిది నెలల్లో అందిన ఫిర్యాదులన్నింటిపై వెంటనే చర్యలు చేపడుతున్నామని, ప్రతి అంశాన్ని ఆఫీసర్ల ద్వారా సమగ్ర విచారణ చేపట్టినట్లు వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన అవినీతి గురించి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరో విచారణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

అదనంగా పాత అధికారుల్లో ఆరుగురిని తొలగించి కొత్తవారిని నియమించామని, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పీఏసీఎస్, డీసీసీబీ బ్యాంకులను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Read More