టీ తాగేందుకు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి 22 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ఘటన

Parvathipuram Manyam

పార్వతీపురం మన్యం జిల్లా జమ్మవలసకు చెందిన కొండగొర్రె సుక్కు అనే వ్యక్తి 22 ఏళ్ల క్రితం ఇంటి నుంచి దూరమయ్యారు. బ్రతుకుతెరువు కోసం తమిళనాడుకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ట్రైన్‌ దిగిన సుక్కు, టీ తాగడానికి వెళ్లి తిరిగి రాగానే ట్రైన్‌ వెళ్లిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడు. డబ్బులు లేకపోవడంతో కూలీపనులకు వెదికిన సుక్కు, ఓ గొర్రెల కాపరుగా తమిళనాడులోని ఒక వ్యక్తి వద్ద పనిలో చేరాడు.

అయితే ఆ యజమాని సుక్కుకు కూలీ ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుతూ వెట్టిచాకిరి చేయించాడు. దాదాపు 22 ఏళ్ల పాటు అలానే అక్కడే ఉండిపోయిన సుక్కు చివరికి తమిళనాడు కార్మికశాఖ అధికారుల దాడుల్లో వారి కంటపడాడు. ఆ వివరాలు సేకరించిన అధికారులు పార్వతీపురం జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు.

కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను అప్రమత్తం చేసి సుక్కు ఆచూకీ కోసం గ్రామాల్లో విచారణ చేపట్టారు. అయితే సుక్కు పేరు అప్పారావుగా మారిపోవడంతో ఆయనను గుర్తించడం కష్టమైంది. చివరికి సుక్కు కుమార్తె ములక్కాయవలసలో ఉందని గుర్తించి కుటుంబానికి అప్పారావును కలిపారు.

సుక్కు తిరిగి కుటుంబాన్ని కలిసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 22 ఏళ్ల పాటు కూలీ లేకుండా పని చేయించిన యజమాని వద్ద నుంచి సుక్కుకు డబ్బులు ఇప్పించడంతో పాటు, జీవనోపాధి కోసం మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Read More

One thought on “టీ తాగేందుకు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి 22 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ఘటన

Comments are closed.