హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. మార్చి 16 వేకువజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వక్ కుటుంబం మొత్తం ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన సోదరి వన్మయి బెడ్రూమ్లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
మూడో అంతస్తులో ఉన్న వన్మయి గదిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో ఆమె అనుమానంతో అల్మారాలను పరిశీలించింది. అయితే, అందులో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే తండ్రికి సమాచారం అందించింది. కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఫిల్మ్ నగర్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఉదయం 5:50 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి మూడో అంతస్తుకు వెళ్లినట్లు కనిపించింది. ఆ వ్యక్తి వెనుక గడియల గుండా ఇంట్లోకి ప్రవేశించి, వన్మయి గదిలో ఉన్న బంగారం దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగ దాదాపు 20 నిమిషాల్లోనే తన పని ముగించుకుని వెళ్లిపోయినట్లు స్పష్టమైంది.
దొంగిలించిన ఆభరణాల్లో రెండు డైమండ్ రింగులు, రూ.2.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని కరాటే రాజు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.

One thought on “హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు”
Comments are closed.