ఫామ్‌హౌస్‌లో కోడి పందాల కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (BRS MLC Pochampally Srinivas Reddy) పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు ఎమ్మెల్సీకి రెండు సార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి సారి నోటీసులపై పోచంపల్లి సమాధానం ఇచ్చినప్పటికీ, రెండోసారి మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పోలీసుల నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు.
సంక్రాంతి తర్వాత మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కోడిపందాలు, క్యాసినో ఆడుతున్న 64 మందిని అదుపులోకి తీసుకుని, రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన వారు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఈ కేసులో భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈ ఫామ్‌హౌస్‌లో కోడి పందాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా ఫామ్‌హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎమ్మెల్సీకి మొదటి సారి నోటీసులు జారీ చేయగా, ఫిబ్రవరి 17న తన న్యాయవాదితో కలిసి హాజరై వివరణ ఇచ్చారు. 2023లో రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి తన ఫామ్‌హౌస్‌ను లీజుకు ఇచ్చినట్లు, కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అయితే రెండోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని పోలీసుల నుంచి ఆదేశాలు రావడంతో ఈరోజు (శుక్రవారం) ఆయన విచారణకు హాజరయ్యారు.
