బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లా రెడ్డి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో చర్చలకు దారితీశారు. తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ రోజు మీడియాతో మాట్లాడిన మల్లా రెడ్డి, “ఒకప్పుడు చిరంజీవి నంబర్ వన్ స్టార్‌గా ఉన్నారు. కానీ ‘పుష్ప 2’ భారీ విజయంతో అల్లు అర్జున్ ఆయనను మించిపోయారు. ఆ సినిమా రూ.1,800 కోట్లు వసూలు చేసి, అల్లు అర్జున్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కాలానుగుణంగా అందరూ అప్డేట్ అవ్వాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాల గురించి తన అభిప్రాయాలు వెల్లడించిన మల్లా రెడ్డి, తన విద్యాసంస్థలు, టెక్నాలజీపై కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నాకు వ్యర్థమైన రాజకీయాల కంటే విద్యాసంస్థల అభివృద్ధే ముఖ్యం. నేను మూడు విశ్వవిద్యాలయాలను స్థాపించాను. లలిత జువెల్లరీ యజమానిలా, నేను కూడా AI సహాయంతో విద్యాసంస్థలను ప్రమోట్ చేయబోతున్నాను” అని తెలిపారు.
తన విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై మాట్లాడుతూ, “దేశంలోనే తొలిసారిగా నేను విద్యార్థులకు AI సహాయంతో శిక్షణ ఇస్తున్నాను. ల్యాప్‌టాప్ లేకుండా ఎవరూ కళాశాలకు రావొద్దని నేను కఠినంగా చెప్పాను. నైపుణ్యం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు రావాలి. నేను చైనా టెక్నాలజీ సహాయంతో నా యూనివర్సిటీని నడుపుతున్నాను” అని పేర్కొన్నారు.
మల్లా రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సినిమా, విద్యా రంగాల్లో వస్తున్న మార్పుల గురించి ఇంకా కొద్ది రోజులు ఈ చర్చ కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

One thought on “చిరంజీవిని మించిపోయిన అల్లు అర్జున్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లా రెడ్డి!”
Comments are closed.