హైదరాబాద్: నిషేధమున్నా మహానగరంలో చైనా మాంజా (Chinese manja) క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. నామ్ కే వాస్తే వ్యవహరిస్తూ ఈడీ అధికారులు సోదాలు చేసినప్పటికీ, మాంజా అందుబాటులో లేకుండా చేయడంలో విఫలమయ్యారు. దీంతో పలు కుటుంబాల్లో పండగ సంతోషం కరువైంది.
చైనా మాంజా వినియోగంతో వాహనదారులు గాయపడ్డారు. పతంగులు ఎగరేసిన చిన్న పిల్లలు కూడా చేతి వేళ్లతో గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో పావురాలు, ఇతర పక్షులు మరణించాయి. నారాయణగూడ వంతెనపై పడి ఉన్న చైనా మాంజా చుట్టుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ మెడకు గాయాలయ్యాయి.
ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగి సాయివర్ధన్‌రెడ్డి మెడకు గాయమైంది. కేబీఆర్ పార్కు, పాతబస్తీ ప్రాంతాలలో పావురాలు చైనా మాంజా వల్ల మరణించాయి. గత ఏడాది లంగర్‌హౌస్ వంతెనపై ఆర్మీ ఉద్యోగి మాంజాతో గాయపడి మరణించాడు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజాను అమ్మడం, వినియోగించడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, ఈ క్రయవిక్రయాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, కొన్ని ప్రాంతాల్లో చైనా మాంజా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. మంగళ్‌హాట్, పురానాపూల్, ధూల్‌పేట, పాతబస్తీ ప్రాంతాలలో చైనా మాంజా విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మాంజా ధర మాత్రం పెరిగింది. చిన్న బాబిన్ రూ.600, పెద్దవి రూ.1200-1500 వరకు విక్రయిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సమయములో పోలీసులు దాడులు చేసి, రూ.90 లక్షల విలువైన 7,334 చైనా మాంజా బాబిన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి:
