కాకాణి గోవర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు: పోలీసులపై తీవ్ర ఆరోపణలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

నెల్లూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) మరోసారి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోగోలు మండలం, కోళ్లదిన్నెలో టీడీపీ (TDP), వైఎస్సార్‌సీపీ (YSRCP) శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడుల్లో గాయపడిన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కత్తులు చేతబట్టి హల్‌చల్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను పరామర్శించిన కాకాణి మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే, పోలీసులు ఎక్కడున్నా సరే వారిని లాక్కొచ్చి, ఒంటి మీద బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు పోలీసులు ఎదుర్కొనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

మూడువారాల క్రితం కూడా వివాదాస్పద వ్యాఖ్యలు

ఇది మొదటిసారి కాదు, మూడువారాల క్రితం కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో తన అనుచరుడిపై కేసు పెట్టారని ఆరోపిస్తూ, పోలీసులను బెదిరించారు. జిల్లా రెవెన్యూ అధికారులను కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక చూడతామని చెప్పిన ఆయన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

వెంకట శేషయ్యపై లైంగిక దాడి కేసు

కాకాణి ముఖ్య అనుచరుడైన వెంకట శేషయ్యపై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఉద్యోగం ఇప్పిస్తానంటూ లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలతో వెంకట శేషయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఈ వ్యవహారంపై కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఖాకీ దుస్తులు ఊడదీసి పసుపు దుస్తులు ధరించి టీడీపీ నేతల వెనుక తిరగాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ఈ తరహా వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాదోపవాదాలకు పాల్పడటం మరియు అధికారాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

One thought on “కాకాణి గోవర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు: పోలీసులపై తీవ్ర ఆరోపణలు

Comments are closed.