ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్)ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు పిలిపించింది. ఈ మేరకు కేటీఆర్‌కు జనవరి 6, 2025న ఉదయం 10:30 గంటలకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసును యూకేకి చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ) నిర్వహించింది. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా, కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఆదేశాల ప్రకారం అధికారులు రూ. 54.88 కోట్లు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు ప్రారంభించి, కేటీఆర్‌ను జనవరి 7, 2025న విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.
