తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో 1.63 లక్షల కోట్ల నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల రూపాయలు కేటాయించండి

ట్రిపుల్‌ఆర్‌కు 34,367 కోట్లు, మెట్రో రెండో దశకు 24,269 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు 14,100 కోట్లు ఇవ్వండి
పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయండి
4 విమానాశ్రయాలకు అనుమతులు ఇవ్వండి
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో కేంద్రం తెలంగాణకు బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది. కానీ, 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ పై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెట్టుకుంది. రాష్ట్రం కోరుకుంటున్నది 2025-26 బడ్జెట్‌లో 1.63 లక్షల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ, మూసీ నది అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార, సంబంధిత శాఖల మంత్రులు ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు సమర్పించారు.

ట్రిపుల్‌ఆర్‌కు ప్రాధాన్యం

హైదరాబాద్‌కు రీజినల్‌ రింగ్‌ రోడ్డు, పరిశ్రమల వృద్ధి, లాజిస్టికల్‌ హబ్స్‌, ఫార్మాసిటీ ప్రాధాన్య అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఇందుకోసం కేంద్రం నుంచి రూ.34,367 కోట్ల సహాయం కోరుతోంది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, కేంద్రం నుంచి అనుమతులు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ రెండో దశ 76.4 కిలోమీటర్ల పరిధిని కవర్‌ చేయనున్నది. దీనికి కేంద్రం, రాష్ట్ర నిధులతో నిర్మాణం చేయాలని ప్రతిపాదించబడింది. ఇందుకోసం కేంద్రం రూ.24,269 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణ నుండి మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కూడా ముఖ్యమైన ప్రతిపాదనగా ఉంది. ఈ ప్రాజెక్టుకు మూసీ సమీపంలోని 220 ఎకరాల రక్షణశాఖ భూమిని ఇవ్వాలని రాష్ట్ర సర్కారు కోరింది. దీని కోసం రూ.14,100 కోట్ల నిధులు అవసరమవుతాయని, సహకరించాలని కోరింది.

ఏపీ బకాయిలు 2,547.07 కోట్లు త్వరగా చెల్లించండి

కేంద్రం నుండి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంట్లను విడుదల చేయాలని రాష్ట్రం కోరింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రావాల్సిన నిధులు, రాష్ట్రం మీద ఉన్న రూ.2,547.07 కోట్ల అప్పులను త్వరగా చెల్లించాలని కోరింది. 2014-15 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు కేటాయించాల్సిన రూ.495.20 కోట్ల బకాయిలను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్రం అభ్యర్థించింది. కాజీపేటలో సమగ్ర కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కోరుతోంది. వరంగల్‌ జిల్లా మామునూరు, ఖమ్మం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గావ్‌, ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు సమర్పించింది.

ఇలా మొత్తం కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో తెలంగాణకు రూ.1.63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.