ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలపై ప్రజలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల పిల్లలు, మహిళలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని రఘురామ వెల్లడించారు. టెక్నాలజీని వినియోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న మాఫియాలపై చర్చించామని తెలిపారు. లోన్ యాప్‌ల పేరుతో తొలుత ₹10 వేలు ఇచ్చి, ఆపై ₹20,000 వరకు వసూలు చేయాలని బెదిరిస్తున్నారని వివరించారు. ఆన్‌లైన్ జూదాల నియంత్రణకు ఏ చట్టాలు అవసరమో పిటిషన్ కమిటీ చర్చించిందని చెప్పారు.
ప్రతిరోజూ సైబర్ క్రైమ్ సెల్‌కు సుమారు 700 ఫిర్యాదులు వస్తున్నాయని, కానీ ఎంతమేరకు ఎఫ్ఐఆర్‌లు నమోదవుతున్నాయో తెలియదని ఆయన అన్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల కారణంగా 960 మంది మృతి చెందారని, ఏపీలో నష్టం కలిగిన వారి గణాంకాలు లేకపోవడం ఆందోళన కలిగించేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పోలీస్ శాఖకు కేవలం పరుగు పందెం గెలవగలిగిన వారికే కాదు, ఐటీ పరిజ్ఞానం ఉన్నవారిని కూడా నియమించాలన్నది ఆయన సూచన. అప్పుడే సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని రఘురామ అభిప్రాయపడ్డారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పిటిషన్ల కమిటీ సమావేశాలు జరిపి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Read More : క్యూఆర్ కోడ్‌తో ప్రజల స్పందన, ఇంటికే సరుకులు

One thought on “ఏపీలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ఫిర్యాదులు:”
Comments are closed.