ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం ఉదయం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిరిండియాకు చెందిన విమానం టేకాఫ్ సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొని కుప్పకూలిందని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ ఘటన మేఘాని నగర్ పరిధిలోని ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరేందుకు సిద్ధమైన విమానం టేకాఫ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరుతున్న క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొనడంతో ఇది అదుపుతప్పి కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అధికారులు, సహాయ బృందాలు అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏ మేరకు సంభవించిందనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికుల బంధువులు ఈ సమాచారం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read More : తోతాపురి మామిడి దిగుమతిపై ఏపీ-కర్ణాటక మధ్య వాణిజ్య వివాదం.

One thought on “ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం

Comments are closed.