సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో నీటి కొరతపై బీజేపీ ఆగ్రహం

సికింద్రాబాద్‌: నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ దొందూదొందే!

– కంటోన్మెంట్‌ సభ్యుడు జే. రామకృష్ణ

సికింద్రాబాద్‌: నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ పార్టీ కంటోన్మెంట్‌ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జే. రామకృష్ణ అన్నారు. బుధవారం కంటోన్మెంట్‌ ఇందిరమ్మనగర్‌లో పర్యటించిన ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

స్థానికులతో సమావేశమైన రామకృష్ణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తాగునీటి సమస్యలపై ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు సరిపడా అందడం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శ

రామకృష్ణ మాట్లాడుతూ, కంటోన్మెంట్‌కు అవసరమైన నీటి సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకవైపు ప్రజలు నీటి కొరతతో బాధపడుతుంటే, మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు సరిపడా నీరు అందిస్తున్నామని చెప్పడం విపరీతమని ఆరోపించారు.

బీజేపీ పోరాటం గుర్తు

నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ నాయకుల పోరాటం ఫలితంగా ఉచిత నీటిని అందించిందని రామకృష్ణ గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు ఫ్యాషన్‌ షోలు మానుకుని, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. లేకపోతే బీజేపీ ప్రజల కోసం పోరాటం చేసి నీటి సమస్యను పరిష్కరిస్తుందని హెచ్చరించారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో వార్డు 2 బీజేపీ అధ్యక్షుడు మాదరపు అశోక్‌, నాయకులు జయ యాదవ్‌, మమతా, రేఖ, ప్రశాంత్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.