దావోస్‌లో ఆర్థిక సదస్సు: లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ చర్చలు

దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీమిట్టల్‌ను అభ్యర్థించారు.


దావోస్‌లో అట్టహాసంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ప్రారంభం

స్విట్జర్లాండ్‌: దావోస్‌ (Davos)లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు (World Economic Forum Conference) 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. జ్యురిచ్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో ఈ సదస్సు ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, కొత్త భాగస్వామ్యాలపై చర్చ జరిగింది. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటు చేసిన నెట్‌వర్కింగ్ డిన్నర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు.

సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యూరిక్‌ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో కలిసి గత నాలుగు రోజులుగా సింగపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్.. అక్కడి నుంచి దావోస్‌ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జ్యూరిక్‌ చేరుకున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా జ్యూరిక్‌ చేరుకోవడంతో.. ఇద్దరు సీఎంలు కొద్దిసేపు భేటీ అయ్యారు.

ఈ భేటీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై సీఎంలు చర్చించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

తొలిరోజు గ్రాండ్‌ ఇండియా పెవిలియన్‌ ఘనంగా ప్రారంభమైంది. రేవంత్‌తోపాటు కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి

One thought on “దావోస్‌లో ఆర్థిక సదస్సు: లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ చర్చలు

Comments are closed.