11 నుంచి మావుళ్లమ్మ దర్శనం నిలిపివేత
మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
11 నుంచి 25 వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేత
భీమవరం టౌన్, డిసెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 13న ప్రారంభమవుతున్న మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాల కోసం ఆలయ కమిటీ ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈనెల 11 నుంచి 25 వరకు అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మినగేష్ వెల్లడించారు.
11న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళాపకర్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. 24వ తేదీ వరకు ఉత్సవమూర్తికి నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. 25వ తేదీ ఉదయం విశేష పూజల అనంతరం అమ్మవారి కళలను విగ్రహంలో నిక్షిప్తం చేసి కుంభ, గో, దర్పణ దర్శనం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పిస్తామన్నారు.
పృథ్వీ శ్రీచక్రార్చన
మావుళ్లమ్మ ఆలయంలో ఆదివారం పృథ్వీ శ్రీచక్రార్చన పూజ జరిగింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌కు చెందిన నవగోపికా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి దీపాలను వెలిగించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు కలెక్టర్ నాగరాణికి ఆశీర్వచనం అందజేశారు.
