వైద్య సేవలు నిలిచిన ఏపీకి కాంగ్రెస్ హెచ్చరిక..

రాష్ట్రంలోని నెట్వర్క్ ఆస్పత్రులు సోమవారం నుండి వైద్య సేవలను నిలిపివేయడంతో, YS Sharmila కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

“పేదవాడికి వైద్యం అందని ద్రాక్ష అయింది. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం,” అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.3500 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. గత 9 నెలలుగా పూర్తిస్థాయిలో బకాయిలను విడుదల చేయకుండా ఉండటమే ఈ సంక్షోభానికి కారణమని ఆమె స్పష్టం చేశారు.

“వైద్య సేవల బంద్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం”

ఆసుపత్రుల యాజమాన్యాలు గతంలోనే బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ వెల్లడించింది. అందుకే నేటి నుంచి సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.

వైద్యానికి గ్లోబల్ సిటీగా చేయాలని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆపత్కాలంలో వైద్యసేవలు నిలిపివేయడం వల్ల ఏ ఒక్క పేదవాడి ప్రాణం పోయినా అది కూటమి ప్రభుత్వం చేసిన హత్యగా పరిగణించాలంటూ హెచ్చరించారు.

పేదల ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం దెబ్బతీస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు.

Read More : తిరుపతిలో ఫుడ్ పాయిజన్ కలకలం: 11 మంది విద్యార్థులకు అస్వస్థత..