వాట్సప్ వైద్యం కవల శిశువుల మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పట్టణంలో ఓ వైద్యం నిర్లక్ష్యంతో ఇద్దరు కవల శిశువుల ప్రాణాలు పోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భంతో ఉన్న కీర్తికి ఆసుపత్రిలో తగిన వైద్య సేవలు అందకపోవడంతో ఈ విషాదం జరిగింది.

ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలు వివాహం అనంతరం ఏడేళ్ల పాటు సంతానసుఖం కోసం ప్రయత్నించగా.. చివరికి విజయలక్ష్మి ఆసుపత్రిలో వైద్యురాలు అనూషా రెడ్డి వద్ద చికిత్స చేయించుకున్నారు. ఇటీవల కీర్తి గర్భవతిగా మారింది. అయితే ఆదివారం ఉదయం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అయితే ఆ సమయంలో డాక్టర్ అనూషారెడ్డి ఆసుపత్రిలో లేరు. దీంతో ఆమె వాట్సప్ వీడియో కాల్ ద్వారా నర్సుకు సూచనలు అందించారు. ఆ సూచనల ప్రకారం నర్సు కీర్తికి ఇంజెక్షన్లు వేసింది. అయితే చికిత్స సరిగా జరగకపోవడంతో కీర్తి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు.

ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు లోనైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. “డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా పిల్లలు చనిపోయారు.. పైగా ఆసుపత్రి యాజమాన్యం మేం రూ.30 వేల వైద్యం ఖర్చు చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే సంతానం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశామని, కవలల ప్రసవం జరగబోతుందని కుటుంబంలో సంతోషం నెలకొన్న సమయంలో ఇలా ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి పరిశీలించి, తాత్కాలికంగా ఆసుపత్రిని సీజ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైద్య నియమ నిబంధనలపై చర్చకు దారితీసింది.

Read More : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన నాయకుడు

One thought on “వాట్సప్ వైద్యం కవల శిశువుల మృతి

Comments are closed.