ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఆరు నెలలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్ గవర్నెన్సు (WhatsApp Governance) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
QR కోడ్ ద్వారా ధృవీకరణ పత్రాలు
ఈ సేవల ద్వారా ప్రజలు వాట్సాప్‌లోనే అవసరమైన పౌరసేవలను పొందవచ్చని మంత్రి తెలిపారు. ప్రత్యేక యాప్ అవసరం లేకుండా ప్రతీ ఒక్కరూ వినియోగించే వాట్సాప్‌ను ఈ సేవల కోసం ఉపయోగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. QR కోడ్ ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేసి ప్రజలకు మరింత సులభతరం చేయనున్నట్లు తెలిపారు.
300 సేవల లక్ష్యం
ప్రస్తుతం 200 పౌరసేవలు వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని, ఈ నెలాఖరుకు 300 సేవలను అందించేలా కార్యాచరణ చేపట్టినట్లు లోకేష్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆస్తి పన్నులు చెల్లింపు తదితర సేవలు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా పొందవచ్చన్నారు.
టీటీడీ సేవలు త్వరలో
73 దేవాదాయ శాఖ సేవలు ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్సులో అందుబాటులో ఉండగా, త్వరలోనే టీటీడీ సేవలు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త కరెంటు కనెక్షన్ సహా 19 రెవెన్యూ సేవలు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయని వెల్లడించారు.
హాల్ టికెట్లు నేరుగా ఫోన్‌కు
ప్రజలు తమ ఫిర్యాదులు కూడా వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా 51 లక్షల లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. విద్యార్థులకు హాల్ టికెట్లు నేరుగా వారి ఫోన్‌కు పంపే విధంగా ఈ సేవలను విస్తరించామన్నారు.
పూర్తి భద్రతతో సేవలు
ప్రజల వ్యక్తిగత డేటా పూర్తి భద్రతతోనే ఉంచుతున్నామని, సైబర్ సెక్యూరిటీ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ ద్వారానే ధృవీకరణ జరుగుతుందని తెలిపారు.
సీఎం చంద్రబాబు లక్ష్యం
ప్రజలకు కార్యాలయాలపై ఆధారపడే అవసరం లేకుండా సేవలను నేరుగా అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు “మా మిత్ర” పేరిట వాట్సాప్ గవర్నెన్సు సేవలను ప్రజలకు చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.

One thought on “ప్రజలకు మరింత దగ్గరగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు”
Comments are closed.