బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతోంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్లపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొలి ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ.183.25 కోట్లు మాత్రమే రాబట్టింది. సోమవారం రోజున అన్ని భాషల్లో కలిపి రూ.8.50 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. ఆదివారం రూ.32.15 కోట్లు వసూలు చేసిన సినిమా, ఒక్క రోజులోనే ఇంత పెద్ద పతనం నమోదు చేయడం షాక్ కలిగించింది.
మొదట్లో తెలుగు వెర్షన్ నుంచి మంచి వసూళ్లు వచ్చినప్పటికీ, వారాంతానికి కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. హిందీ వెర్షన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. విడుదల రోజున రూ.44.5 కోట్లు సాధించినా, శనివారం నాటికి అది రూ.26 కోట్లకు పడిపోయింది.
రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అయితే, రజనీకాంత్ నటించిన ‘కూలీ’ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం, సోషల్ మీడియాలో “వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లోనే బలహీనమైన చిత్రం” అంటూ వస్తున్న విమర్శలు కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ ఏడాది హిందీలో విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తర్వాత రెండో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచినా, ఆ జోరును కొనసాగించలేకపోయింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కీలక పాత్రలో నటించారు. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా, 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వార్’కు సీక్వెల్‌గా విడుదలైంది.
Read More : పరదా సినిమాపై అనుపమ నమ్మకం వైరల్

One thought on “వార్ 2 బాక్సాఫీస్‌లో నిరాశపరిచిన హృతిక్-ఎన్టీఆర్ ?”
Comments are closed.