ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ అనారోగ్యానికి గురైన ఘటన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగం గ్రామంలో ఆదివారం జరిగిన ‘మిస్ కూవాగం 2025’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, వేదికపైనే హఠాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు.
ఈ ఘటనతో అక్కడి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించిన నిర్వాహకులు, అభిమానులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, కొద్దిసేపటికే విశాల్‌ను నిలబెట్టారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మాజీ మంత్రి పొన్ముడి ఆధ్వర్యంలో సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల విశాల్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘మద గజ రాజా’ సినిమా ప్రచార సమయంలో కూడా ఆయన కాస్త నీరసంగా కనిపించడంతో ఆరోగ్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే, అప్పట్లో ఆయన బృందం తీవ్ర జ్వరమే కారణమని స్పష్టం చేసింది.
తాజా సంఘటనతో విశాల్ ఆరోగ్యంపై మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Read More : బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ
