విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై షర్మిల ఘాటుగా.

ys sharmila

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను కాంగ్రెస్ పార్టీ కట్టడి చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఈ దిశగా కేంద్రం కార్మికులను తొలగించడం, ప్లాంట్ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు తీసుకోవడం తగదని అన్నారు.

ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ – “కార్మికుల హక్కుల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు అనే నినాదాన్ని మరోసారి బలంగా వినిపిస్తాం” అని తెలిపారు.

ప్లాంట్‌కు కాంగ్రెస్ బీజం.. బీజేపీ కుట్రలతో నష్టాలు
వైఎస్ షర్మిల మాట్లాడుతూ – “కాంగ్రెస్ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభమైంది. అప్పట్లో లాభాల్లో నడిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్లాంట్‌ను నిర్వీర్యం చేయాలని కుట్రలు మొదలయ్యాయి. ఉద్యోగులను తొలగించడం, ముడి సరుకు నిలిపివేయడం, సొంత గనులు ఇవ్వకుండా అడ్డుకోవడం అన్నీ ప్లాంట్‌ను దెబ్బతీసేందుకు తీసుకున్న చర్యలే” అని విమర్శించారు.

రూ. 11 వేల కోట్లు నిధుల మాట అబద్ధమే
“కేంద్రం స్టీల్ ప్లాంట్‌కు రూ.11 వేల కోట్లు మంజూరు చేసిందన్న ప్రచారం అబద్ధం. అందులో రూ.8 వేల కోట్లు బ్యాంకుల రుణాల పేరిట తిరిగి తీసుకున్నారు. మిగిలిన రూ.3 వేల కోట్ల కోసం 5 వేల మంది ఉద్యోగుల తొలగింపు షరతు పెట్టారు. ఇది అదానీలకు ప్లాంట్‌ను అప్పగించేందుకు బీజేపీ కుట్రే” అని ఆరోపించారు.

చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు
వైఎస్ షర్మిల రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. “ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం వహిస్తున్నారు. మోదీకి ఊడిగం చేస్తున్నారా? లేక కుట్రలో భాగమయ్యారా?” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో, విశాఖ ఉక్కు కోసం పోరాటం కొనసాగుతుందని, ప్లాంట్‌ను ప్రజల హక్కుగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Read More : మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.