తమిళ సూపర్ స్టార్ విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాను చేస్తున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కోలీవుడ్ ప్రేక్షకులు విజయ్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాలు సైతం విజయ్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు అందించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో హీరో శివ కార్తికేయన్ విజయ్‌కు తగిన గౌరవం ఇవ్వడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. జన నాయగన్ సినిమాను 2026 పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో విజయ్ అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు ఆ తేదీకి మరే సినిమా పోటీగా విడుదల కాకూడదని అభిప్రాయపడుతున్నారు.
అయితే, శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి సినిమా కూడా అదే సమయానికి విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది విజయ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విజయ్‌కి ప్రత్యేక అభిమానం ఉందని చెప్పుకునే శివ కార్తికేయన్ అలా చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శివ కార్తికేయన్‌కి విజయ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన సినిమాలో అతిథి పాత్రలో కూడా నటించిన విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ సినిమాకు పోటీగా శివ కార్తికేయన్ సినిమా రావడం ఏమాత్రం సరైన చర్య కాదని అంటున్నారు. పరాశక్తి విడుదలపై స్పష్టత ఇచ్చి, విజయ్‌కి గౌరవంగా పోటీ నుంచి తప్పుకోవాలని విజయ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి, శివ కార్తికేయన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి!
