వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీ అరెస్ట్ అక్రమమని ఆయన భార్య పంకజశ్రీ హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
అరెస్టు సమయంలో సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పిటిషన్
వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్ అవసరం అని పంకజశ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత నెల 10 నుంచి 15వ తేదీ వరకు పటమట పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను కోరినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వంశీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం, ఏపీ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.
వంశీ కస్టడీపై ఇవాళ విచారణ
ఇదిలా ఉండగా, వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విచారణ కోసం 10 రోజులు కస్టడీ అనుమతి కోరారు. ఇప్పటికే సత్యవర్థన్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు, వంశీ బెయిల్ పిటిషన్‌తో పాటు తమ పిటిషన్‌ను కూడా ఇవాళ కోర్టులో వినిపించనున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు ఈ నెల 17వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.
