అమెరికాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలయ్యారు. వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనలో ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, వారి చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషాదకర ఘటనపై టేకులపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతి చెందిన కుటుంబం దాదాపు 15 సంవత్సరాల క్రితమే అమెరికాకు వలస వెళ్లినట్లు సమాచారం. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
