అగ్రరాజ్యం అమెరికా మరియు డ్రాగన్ దేశం చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇరుదేశాల మధ్య సుంకాల పెంపు చర్యలతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది.
చైనా నుంచి దిగుమతి అవుతున్న వాణిజ్య వస్తువులపై సుంకాలను అమెరికా ట్రంప్ సర్కార్ భారీగా పెంచింది. ఇప్పటి వరకు 145 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని తాజాగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయం చైనా తీసుకున్న మరో కీలక చర్యకు ప్రతీకారంగా తీసుకున్నదని అమెరికా వెల్లడించింది. రెండు రోజుల క్రితం, అమెరికాలో నిర్మితమైన బోయింగ్ విమానాల కొనుగోళ్లను నిలిపివేయాలని, ఆయా సంస్థలకు చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బోయింగ్ సంస్థకు చెందిన విడిభాగాలను కూడా కొనుగోలు చేయరాదని స్పష్టంగా హెచ్చరించింది.
చైనా ఆదేశాల మరుసటి రోజే అమెరికా ప్రతిస్పందనగా దిగుమతి సుంకాలను పెంచింది. ఈ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో గణనీయంగా పెరగనున్నాయి. దీంతో అమెరికా వినియోగదారులు చైనా ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఇదే సమయంలో అమెరికా వస్తువులపై చైనా ఇప్పటికే 125 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల సుంకాల పెంపుతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి నెలకొంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read More : అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం..

2 thoughts on “అమెరికా-చైనా సుంకాల యుద్ధం తీవ్రంగా ముదురింపు..”
Comments are closed.