రష్యా డ్రోన్లను కూల్చేందుకు ఉక్రెయిన్ వినూత్న పథకం.

ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యా డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రష్యా డ్రోన్లను గుర్తించి, నేలకూల్చే పనిని చేపట్టే పౌరులకు నెలకు సుమారు రూ. 2.2 లక్షల వరకు జీతం అందించనున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు, డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారామిలిటరీ సభ్యులు పాల్గొంటారు. వారు ఆధునిక మానవరహిత విమానాలు, ఆయుధాలు వంటి సాంకేతిక పరికరాల సహాయంతో రష్యా డ్రోన్లను గుర్తించి కూల్చివేస్తారు. దీనికి కావాల్సిన నిధులు స్థానిక బడ్జెట్ల నుంచి సమకూర్చనున్నారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మార్షల్ లా కొనసాగేంత వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతంగా పెంచాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై రష్యా, ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లతో రష్యా పలు దాడులు నిర్వహిస్తోంది. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా తన డ్రోన్ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఇటీవలే ‘స్పైడర్ వెబ్’ పేరుతో ఉక్రెయిన్ రష్యా భూభాగంపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో, పౌరుల సహకారంతో డ్రోన్ వ్యతిరేక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఉక్రెయిన్ భావిస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా సైన్యంపై భారం తగ్గిస్తూనే, డ్రోన్ ముప్పును సమర్థంగా ఎదుర్కోవచ్చని ఉక్రెయిన్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More : రాకెట్‌తో ఈ-కామర్స్ డెలివరీలో చైనా సంచలనం

One thought on “రష్యా డ్రోన్లను కూల్చేందుకు ఉక్రెయిన్ వినూత్న పథకం.

Comments are closed.