792 గిరిజన గ్రామాల నుంచి 292కు తగ్గింపు: హైకోర్టు చర్యలపై ప్రశ్నలు
రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాల సంఖ్య ఇప్పుడు 292గా తగ్గిపోయిన నేపథ్యంలో, హైకోర్టు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలు ఏమయ్యాయన్నది స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని ఎందుకు, ఏ అధికారంతో తగ్గిస్తున్నారన్న అంశంపై వివరాలు సమర్పించాలని, లేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలో బుధవారం విచారణ జరిపింది. గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని కుదించి, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నేపథ్యంగా ఈ విచారణ జరిగింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, గిరిజన ప్రాంతాల పరిధిని ఉద్దేశపూర్వకంగా కుదించడమే కాకుండా, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపి గిరిజనులను నష్టపరిచారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని కోర్టుకు వివరించారు. సమాచార హక్కు చట్టం కింద అధికారుల ఇచ్చిన వివరాల ప్రకారం, గతంలో 792 గ్రామాలు ఉండగా, ఇప్పుడు 292 గ్రామాలే మిగిలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించి, ఈ చర్యలపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావును ప్రశ్నించింది. గిరిజన గ్రామాల ప్రాముఖ్యతను అనుసరించి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరాన్ని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది
