తిరుపతి జిల్లా అడవీప్రాంతాల్లో మరోసారి ఏనుగుల బెడద ప్రజలను కలవరపెడుతోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు తరచూ పంటలపై దాడి చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరిచిన ఘటనలు పలు మార్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఏనుగుల దాడుల్లో పలువురు గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
తాజాగా తిరుపతి జిల్లా బోయిపల్లి అటవీప్రాంతంలో రెండు ఏనుగులు సంచరిస్తుండగా, వాటిని గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు స్పందించిన ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో ఏనుగుల కదలికలను గుర్తించింది. వాటిని అడవిలోకి తరిమేందుకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే ఈ క్రమంలో ఏనుగులు అకస్మాత్తుగా అటవీశాఖ సిబ్బందిపై తిరగబడి దాడికి తెగబడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రాణాల కోసం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ అనే ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
ఏనుగుల ఉనికి కారణంగా కోటకాడపల్లి, ఎలమంద, ఉష్టికాయపెంట గ్రామాల వద్ద పంట పొలాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఏ క్షణమైనా గజరాజులు మళ్లీ బయటపడే ప్రమాదం ఉన్నందున స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు భారీ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. డ్రోన్లు, స్పెషల్ ఫోర్సులతో గజరాజుల కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పంటలు చేతికి వచ్చే ఈ సమయంలో ఏనుగుల దాడులు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉండటంతో… పరిష్కార చర్యలు ముమ్మరం చేశారు.
Read More : టీడీపీ నేతల హత్యలపై అనుమానాలు : CM

One thought on “తిరుపతి జిల్లాలో ఏనుగుల ఉద్ధృతి”
Comments are closed.