బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘నా నాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి? నీకు నొప్పి ఎందుకు రావాలి?’’ అంటూ కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటి ఆడబిడ్డపై ఎటుపడితే అటు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తనను టార్గెట్ చేస్తూ పార్టీ నేతలు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. “కేసీఆర్ నీడలో ఉన్నవారు నాపై ప్రతాపం చూపిస్తున్నారని” మండిపడ్డారు.
కేసీఆర్‌కు మాత్రమే నేను పనిచేస్తాను
తాను బీఆర్ఎస్ పార్టీకి చెందినవని, తన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కవిత స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను గౌరవిస్తానని చెప్పారు గానీ, ఇతరుల నేతృత్వంలో పనిచేయనని కుండబద్దలు కొట్టారు. జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేయాలనుకున్నానని, అయితే కేసీఆర్ అనుమతించలేదని గుర్తు చేశారు.
కేటీఆర్‌పై మరోసారి విమర్శలు
‘‘క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్వీటర్లలోనే పరిమితమవుతున్నారా?’’ అని కేటీఆర్‌ను మరోసారి నిలదీశారు. తనను కోవర్ట్ అనడం సబబేనా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాల కోసం పెయిడ్ ఆర్టిస్ట్‌లను ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆమె ఆరోపించారు.
బీజేపీ – బీఆర్ఎస్ కలయికపై సందేహం
బీజేపీకి బీఆర్ఎస్‌ను అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలు లోపల నుంచే కేసీఆర్‌కు ఇదే విషయాన్ని చెప్పానని, తాను సంవత్సరాలు అయినా జైలులో ఉండటానికి సిద్ధంగా ఉన్నానని అప్పుడే స్పష్టపరిచానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలే ఓడించారంటూ ఆవేదన
2019లో నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించిందెవరో పార్టీకి తెలుసునని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓడించారని తీవ్ర వేదన వ్యక్తం చేశారు. వరంగల్ సభ తమ వల్లే సక్సెస్ అయిందని కొందరు భావిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, ఏపీ ప్రాజెక్టులపై ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసిన కవిత, కేంద్రం ఎందుకు అడ్డు చెప్పడం లేదని ప్రశ్నించారు. గోదావరి జలాల పంపకం ఇంకా సరిగా జరగలేదని, బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
కాళేశ్వరం విషయంపై మౌనమేనా?
కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు వచ్చినా పార్టీ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. పార్టీని రక్షించాల్సిన పెద్ద నేతలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని నిలదీశారు. తాను కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం చేశానన్నది అసత్యమని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ మునిగిపోతున్న నౌక’’ అని పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ కోసం పోరాటం
తాను సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడతానని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది మహాభారతం క్యారెక్టర్లు వేసుకుంటున్నారని, స్థాయికి మించి ఊహించుకోవద్దని సూచించారు.
ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లోతైన అంతర్గత విభేదాలు బయటపడినట్టు కనిపిస్తోంది. పార్టీలోని ఆంతర్య రాజకీయాలు వేడెక్కుతున్నాయన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
Read More : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డులు ప్రకటించింది.

One thought on “కవిత : సోదరుడు కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు.”
Comments are closed.