తిరుపతి నగరంలోని తిరుచానూరు పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రంగనాథం వీధిలో అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఓ కారులో ఇద్దరు యువకులు మృతదేహాలుగా కనిపించడం తీవ్ర సంచలనానికి కారణమైంది. కారులోంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని కారు డోర్లను తెరిచి చూడగా, లోపల ఇద్దరు యువకులు మృతదేహాలుగా ఉన్నట్లు గుర్తించారు. మృతులను వినయ్, దిలీప్‌లుగా గుర్తించిన పోలీసులు, వారి మృతికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. కారు లోపల నాలుగు బీరు బాటిళ్లు లభించడంతో మద్యం సేవించి కారులో నిద్రపోయినట్టు భావిస్తున్నారు. అందులో ఏసీ ఆన్ చేయకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదవశాత్తు మృతులేనో లేక ఇందుకు మరెంతైనా కారణాలున్నాయో తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై సాయినాథ్ చౌదరి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో తిరుపతి ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read More : రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనంపై కీలక వ్యాఖ్యలు

One thought on “తిరుపతిలో కారు నుంచి ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం”
Comments are closed.