ఫోన్ కాల్ లీక్‌తో పదవి కోల్పోయిన థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా.

థాయిలాండ్‌లో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం ఏడాది క్రితం దేశ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పటోంగ్టార్న్ షినవత్రా ఒక్క ఫోన్ కాల్ లీక్ కారణంగా తన పదవిని కోల్పోయారు. నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో ఆమెను ప్రధానిగా అనర్హురాలిగా ప్రకటిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

ఈ సంవత్సరం మేలో థాయిలాండ్–కంబోడియా సరిహద్దు వివాదం చెలరేగిన సమయంలో షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె సొంత దేశ సైన్యాధికారిపై విమర్శలు చేసిన ఆడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. దేశ ప్రయోజనాలను విస్మరించి, పొరుగు దేశానికి అనుకూలంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేసింది. షినవత్రా తొలగింపుతో ఇప్పుడు కొత్త ప్రధాని ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. ఫ్యూథాయ్ పార్టీకి పార్లమెంట్‌లో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ కష్టతరంగా మారనుంది. కొత్త నాయకుడు ఎన్నుకునే వరకు ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రధాని పదవి కోసం ఫ్యూథాయ్ పార్టీ సీనియర్ నేత 77 ఏళ్ల చైకాసెం నితిసిరి, మాజీ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా పేర్లు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షినవత్రా, మళ్లీ అంతే రీతిలో పదవి కోల్పోవడం థాయ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : జపాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం