లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ30వ నిందితుడిగా ఉన్న పైలా దిలీప్, ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిని పోలీసులు బెదిరిస్తున్నారని, లిక్కర్ స్కాం డబ్బుతో ఇల్లు కట్టామని ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దుష్ప్రచారం చేస్తూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన ఏసీబీ కోర్టు, సంబంధిత పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, లిక్కర్ స్కాంలో సిట్ ఇప్పటికే నిందితుల ఆస్తులను అటాచ్ చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు 11 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, ప్రధాన నిందితులు ఉన్నారు.
నోటీసులు అందుకున్న వారిలో రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, కాశీచయనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నల్లనన్ మతప్పన్ (MP డిస్టిలరీ, SNJ సుగర్స్), అలాగే ఎస్బిఐ చెన్నై, ఐసిఐసిఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నారు.
ఈ రోజు విచారణలో SNJ సుగర్స్, MP డిస్టిలరీస్, నిందితుడు వరుణ్ పురుషోత్తం హాజరయ్యారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరు తమ ఆస్తుల అటాచ్మెంట్‌పై ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలిపారు.
Read More : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర?
