థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో ఘర్షణలు..

థాయ్‌లాండ్‌, కంబోడియా సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల సైనికుల మధ్య పలు ప్రాంతాల్లో భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఓ సైనికుడితో పాటు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. వరుసగా పెరుగుతున్న ఉద్రిక్తతలతో భారత్‌ అప్రమత్తమైంది.

థాయ్‌లాండ్‌లోని భారత రాయబారి కార్యాలయం కీలక ట్రావెల్‌ అడ్వైజరీ విడుదల చేసింది. భారతీయులు థాయ్‌లోని ఉబోన్‌ రాట్చథాని, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కాయో, చంతబురి, ట్రూట్‌ అనే ఏడు ప్రావిన్స్‌లకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

థాయ్‌ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్‌ కాంగ్‌సిరి తెలిపిన ప్రకారం, సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. బుధవారం థాయ్‌లో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు కారణమైంది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్‌ సైనికులు గాయపడ్డారు.

ఈ పేలుడుకు కంబోడియా కారణమని థాయ్‌ ఆరోపించగా, అది పాత మందుపాతర అయి ఉండవచ్చని, తమకు సంబంధం లేదని కంబోడియా స్పష్టం చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వెంబడి మళ్లీ ఘర్షణకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా ఘర్షణలు కొనసాగినట్లు సమాచారం.

Read More : తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో మృతదేహం మాయం!

One thought on “థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో ఘర్షణలు..

Comments are closed.