తెలుగు రాష్ట్రాల్లో ఎండల మోత, వర్ష సూచనలతో వాతావరణ శాఖ హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతుండగా, రానున్న రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

విశాఖపట్నం వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగనుండగా, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇక, ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 28 డిగ్రీల నుంచి గరిష్ఠంగా 40 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేడి, ఉక్కపోత ప్రభావం తీవ్రంగా ఉండనుందని హెచ్చరికలు జారీ చేశారు.

ఇక మధ్య మధ్యలో పడుతున్న అకాల వర్షాలు రైతులకు కంటతడి మిగిల్చుతున్నాయి. వడగళ్ల వానలతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఈదురు గాలులతో నేలకూలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వెలుగొమ్మల, అయ్యవారిపల్లి గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా 300 ఎకరాల వరి పంట నాశనమైంది. అదే విధంగా 8 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 8 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కలిసి వ్యవసాయ రంగాన్ని బాగా దెబ్బతీశాయి. అంచనా వేయబడిన నష్టం విషయంలో అధికారులు సమీక్షలు చేపట్టినట్టు సమాచారం.

One thought on “తెలుగు రాష్ట్రాల్లో ఎండల మోత, వర్ష సూచనలతో వాతావరణ శాఖ హెచ్చరిక!

Comments are closed.