తెలంగాణలో విస్తారంగా వర్షాలు.

తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే రోజుల్లో వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజులలో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. తూర్పు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రేపటికి ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.

Read More : ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ సమావేశం