శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం

srisailam tunnel

శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ప్రమాదం – కార్మికులకు తీవ్ర గాయాలు

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పై కప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం 8:30 గంటలకు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఎస్ఎల్‌బీసీ ఎడమ వైపు సొరంగం పనులు సాగుతున్న సమయంలో, టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద అకస్మాత్తుగా పైభాగం కూలిపోయింది.

ఈ ప్రమాద సమయంలో టన్నెల్లో ఏడుగురు కార్మికులు ఉన్నట్లు తెలిసింది. వారందరూ తీవ్రంగా గాయపడి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన సమయంలో భారీ శబ్ధం రావడంతో సమీపంలో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరుగులు తీశారు.

సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇంజనీర్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఇరిగేషన్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన అంశాలను నిర్ధారించేందుకు విచారణ చేపట్టారు.

Read More