** ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చోటుచేసుకున్న ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత మూడు రోజులుగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సంబంధిత బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది టన్నెల్‌లో ఉండగా, 42 మంది సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా అనేక బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు
టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా తిరిగి రావాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి వెళ్లిన మంత్రి.. మల్లికార్జున స్వామిని దర్శించుకొని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారికి రక్షణ కల్పించాలని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. టన్నెల్ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా దేవుని ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించారు.
ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆందోళన
టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా, మట్టికుప్పలు, నీటి ప్రవాహం సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతో గల్లంతైన కార్మికులను వెలికితీయడం సవాల్‌గా మారింది.
చిక్కుకున్న కార్మికుల వివరాలు
అధికారుల ప్రకారం, టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. వీరిలో గుర్జీత్ సింగ్ (పంజాబ్), సన్నీత్ సింగ్ (జమ్మూ కశ్మీర్), శ్రీనివాసులు, మనోజ్ రూబెన్ (యూపీ), సందీప్, సంతోష్, జట్కా హీరాన్ (జార్ఖండ్) ఉన్నారు. వీరిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేశాయి.

One thought on “ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి”
Comments are closed.