సిగాచీ కెమికల్ పరిశ్రమలో : మృతుల సంఖ్య 42కి చేరిక

తెలంగాణ రాష్ట్రం పశమైలారాలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 42కి పెరిగింది. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సోమవారం రాత్రి వరకు 12గా ఉన్న మృతుల సంఖ్య, మంగళవారం ఉదయానికి 34కి పెరిగింది. తాజా సమాచారం మేరకు శిథిలాల తొలగింపు సమయంలో మరిన్ని మృతదేహాలు బయటపడటంతో ఈ సంఖ్య 42కి చేరింది. సహాయక చర్యలు చివరి దశలో ఉన్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పీటీఐకు తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరికాసేపట్లో ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గవర్నర్ కార్యాలయం ద్వారా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. డాన్ కిషోర్‌కు ఫోన్‌ చేసి అన్ని రకాల సహాయ చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెలికితీసేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం రిస్క్‌ జోన్‌లోకి సహాయక బృందాలు ప్రవేశించి మిగిలిన శిథిలాలను తొలగిస్తూ మరికొన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read More : ఖమ్మంలో ఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి

One thought on “సిగాచీ కెమికల్ పరిశ్రమలో : మృతుల సంఖ్య 42కి చేరిక

Comments are closed.