రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత విషాదాన్ని మిగులుస్తోంది. శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఏడాది వయసున్న పసికందుతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఉక్రెయిన్ మరోసారి షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే… ఈరోజు ఖార్కివ్‌లోని ఐదంతస్తుల నివాస భవనంపై రష్యా డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు పౌరులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న యువకుడు, యువతిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.
ఈ దాడికి కొన్ని గంటల ముందు కూడా ఖార్కివ్‌పై రష్యా క్షిపణి దాడి జరిగింది. ఆ ఘటనలో 13 ఏళ్ల బాలుడితో సహా ఎనిమిది మంది గాయపడ్డారని సమాచారం.
ఇక మరోవైపు, గత శుక్రవారం రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని రష్యా గవర్నర్ అలెగ్జాండర్ ఖిన్‌ష్టెయిన్ వెల్లడించారు. రైల్వే జిల్లాలోని ఒక భవనంపై డ్రోన్ దాడి జరగడంతో పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.
ఇలా ఇరుపక్షాల దాడులు కొనసాగుతున్న సమయంలోనే, ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య కీలక సమావేశం జరిగింది. మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన అంశమైంది. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ… కాల్పుల విరమణ కాకుండా, ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష శాంతి ఒప్పందం ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని వ్యాఖ్యానించారు. దౌత్య చర్చలతో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : యుద్ధం ముగింపుపై భిన్న ప్రకటనలు
One thought on “ఖార్కివ్‌లో రష్యా డ్రోన్ దాడి: పసికందుతో సహా 5 మంది మృతి”
Comments are closed.