రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో 1,532 మంది లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రకటించారు.
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు
తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య ప్రధాన కారణమని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం ఉద్యోగ అవకాశాలను స్వయంగా లాక్కున్న కారణంగా నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదని ఆయన ఆరోపించారు.
55 రోజుల్లో 11 వేల టీచర్ పోస్టులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డ రేవంత్, కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు భవిష్యత్ తరాల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రైవేట్ స్కూల్స్‌తో పోటీ పడేందుకు ప్రభుత్వ పాఠశాలలు సమర్థంగా తయారవ్వాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళనకరమని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
క్రీడలకు ప్రాధాన్యత
విద్యార్థులపై పెట్టుబడి ఖర్చు కాదని, వారి భవిష్యత్ కోసం పెట్టుబడిగా చూడాలని సీఎం సూచించారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, పారాలింపిక్స్ క్రీడాకారిణి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం కల్పించినట్లు వివరించారు.
‘అన్నీ అప్పులు.. తప్పులే’
కేసీఆర్ హయాంలో అప్పులు, తప్పులు మాత్రమే వారసత్వంగా అందిందని సీఎం రేవంత్ విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నన్ను పనిచేయనివ్వండి.. రాష్ట్రాభివృద్ధికి మీ సహకారం అవసరం’ అంటూ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.
