నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మంచి స్నేహబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు సీఎంగా ఉన్నప్పటికీ రేవంత్ కవితపై ఎప్పుడూ విమర్శలు చేయలేదని అర్వింద్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ వారసులే కారణం
కేసీఆర్ తన పిల్లలను రాజకీయాల్లోకి తెచ్చినందువల్లే బీఆర్ఎస్ బలహీనపడిందని అర్వింద్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఆయన తరువాత హరీశ్ రావు నాయకత్వం వహించాల్సిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చురుకైన రాజకీయ నాయకుడు అని ప్రశంసించిన అర్వింద్, బీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీపై ఎక్కువగా చర్చించకపోవడాన్ని కూడా వ్యూహాత్మకంగా విశ్లేషించారు. “ఎవరి పేరును ఎక్కువగా తీసినా, వారికి అనవసర గుర్తింపు కలిగినట్టవుతుంది అని కేసీఆర్‌కి బాగా తెలుసు. కానీ ఈ విషయాన్ని కవిత అర్థం చేసుకోలేకపోయారు,” అన్నారు.
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రకు ప్రశంసలు
కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను అర్వింద్ ప్రశంసించారు. “కేసీఆర్ 13 ఏళ్ల పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. ఆయన అందరినీ కలుపుకొని ముందుకు నడిపే నాయకుడు. ఆంధ్రా నేతల ఎదురెళ్లి ప్రత్యేక రాష్ట్రం సాధించగలిగిన నాయకుడు కేసీఆరే. ఈ విషయంలో ఎంత రాజకీయ విభేదాలున్నా ఆయన ఘనతను కాదనలేం,” అని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న తహతహను కేసీఆర్ తన మాటలతో, విజ్ఞానంతో విజయవంతంగా ముందుకు నడిపారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ పరిణామాల్లో కొత్త మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.
Read More : హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీల్లో సవరణ
