అమెరికా టారిఫ్‌ల ప్రభావం – రెపో రేట్ల కోతలకు ఆర్బీఐ బ్రేక్!

భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆచితూచి అడుగు వేసింది. వరుసగా మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్ర బ్యాంకు, ఈసారి మాత్రం కోతలకు విరామం ఇచ్చింది. రెపో రేటును 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 4న ప్రారంభమైన ఎంపీసీ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈ నెల 7 నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించనున్న విషయం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఈ నిర్ణయంపై గణనీయ ప్రభావం చూపాయి. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతానికి తగ్గి, ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని కమిటీ భావించింది.

ఇదివరకే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో ఆర్బీఐ మొత్తం 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. పండుగల సీజన్ ముందు గృహ, ఎంఎస్ఎంఈ, రిటైల్ రంగాల్లో రుణాల డిమాండ్ పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశ్యంతో ఆ కోతలు చేపట్టారు. గత కోతల ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈసారి విరామం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తామని, బాహ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటూ దేశీయ డిమాండ్‌కు మద్దతు ఇస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లపై మరిన్ని మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని సంకేతాలిచ్చింది.

Read More : దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై ఉగ్ర ముప్పు