రాజమహేంద్రవరం విమానాశ్రయంలో టెర్మినల్ నిర్మాణ పనులలో ఇనుప కడ్డీలు కూలిన ఘటన: ఎంపీ పురందేశ్వరి సమీక్ష

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ భవన నిర్మాణంలో ఇనుప కడ్డీలు కూలిన ఘటనకు సంబంధించి ఎంపీ పురందేశ్వరి ఘటనా స్థలాన్ని సందర్శించి సమీక్ష చేశారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాజెక్టు కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులతో పరిశీలించిన ఎంపీ, ప్రాజెక్టు నిర్వాహకులను నిలదీశారు. చెన్నై రెనాటస్ ప్రాజెక్ట్స్ ఎండీ మనో పూసప్పన్, వైఎస్ ప్రెసిడెంట్ కరు బాకరన్, ప్రాజెక్టు డీజీఎం శరవణులను కూడా ప్రశ్నించారు.

పురందేశ్వరి, ఈ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడితో మాట్లాడినట్లు తెలిపారు. ఇప్పటికే విమానయాన శాఖ అధికారులు, ఐఐటీ నిపుణుల బృందం ఈ ఘటనపై విచారణ జరుపుతుండగా, నివేదిక అందిన తర్వాత నిర్మాణంలో ఏమైనా లోపాలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.